వర్షాకాలం ప్రారంభమవ్వడంతో రైతులంతా ఖరీఫ్ సీసన్ కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది వరితో పాటు మిగిలిన అన్ని పంటలు వెయ్యడానికి రైతులు సంసిద్ధమవుతున్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వెయ్యాలి అన్న అవగాహన లేక ప్రతి ఏటా రైతులు నష్టాలపాలవుతున్నారు. పంటల సాగు సరైన సమయంలో సాగు చెయ్యకుంటే చీడపీడల ఉదృతి ఎక్కువవుతుంది. దీనితోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడై పంట నాణ్యతను దెబ్బతీసి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ పంట ఎప్పుడు సాగు చెయ్యాలి, మరియు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం మీద ద్రుష్టి సారించవలసిన అవకాశం ఉంటుంది.
మొక్కజొన్న:
మొక్కజొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికంగా సాగయ్యే పంట. దీని జీవితకాలం గరిష్టంగా 110 నుండి 120 రోజుల మధ్యలో ఉంటుంది. మొక్కజొన్న సాగు చేసే రైతులు జూన్ 15 నుండి జులై 15 లోపు విత్తనాలు విత్తుకోవాలి. మొక్కజొన్నకు అనువైన వాతావరణం లేకుంటే దిగుబడి తగ్గిపోవడంతో పాటు పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న ఎంతో సున్నితమైన పంట, ముఖ్యంగా నీటి యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. నీరు తక్కువున్నా లేదా ఎక్కువున్న మొక్క తట్టుకోలేదు.
మొక్కజొన్నను ఆలస్యంగా సాగు చేస్తే పురుగుల భారిన పడే ప్రమాదం ఉంటుంది. మొక్కజొన్నను ఎక్కువుగా ఆశించే పురుగుల్లో కాండం తొలుచు పురుగు ఒకటి. దీని ఉదృతి పంట సాగు చేసిన 30 రోజుల తరువాత ఎక్కువుగా ఉంటుంది. 30 రోజుల దాటిన తరువాత మొక్క ఈ పురుగు ఉదృతిని తట్టుకోగలిగే ప్రతిఘటన ఏర్పడుతుంది. కాండం తొలుచు పురుగు ఉదృతి జులై చివరి నుండి ఆగష్టు వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జూన్ 15 నుండి జులై 15 లోపు సాగు ప్రారంభిస్తే కాండంతొలుచు పురుగు కలిగించే నష్టాన్ని తగ్గించవచ్చు.
పెసర పంట:
పెసరను రెండు పంటల మధ్య అంతరపంటగా, మరియు భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట పంటగా రైతులు సాగు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో పప్పు దినుసులకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుంది. పెసర పంటకాలం కూడా చాలా తక్కువ, కేవలం 60-75 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. జూన్ 15 నుండి జులై 15 వరకు పంటను నాటుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. జూన్లో పంట ను సాగు చేస్తే ఆగష్టు రెండో వారానికి పంట చేతికి వస్తుంది.
వర్షాలు ఎక్కువగా ఉంటే పెసర మొక్కల మీదే మొలకెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆగష్టు లోపు సాగును పూర్తి చెయ్యాలి. పెసరను ఖరీఫ్ పంటగా మరియు రబీ పంటగా సాగు చెయ్యచ్చు. రబీలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 30 లోపు పంట సాగు చెయ్యాలి, ఇలా కనుక సాగు చేసినట్లైతే నవంబర్ 20 నుండి జనవరి 15 లోపు పంట చేతికి వస్తుంది.
సోయాబీన్:
ఈ మధ్య కాలంలో సోయాబీన్ పంటకు డిమాండ్ చాలా పెరిగింది. సోయబీన్తో నూనె మరియు నూనె తీసెయ్యగా మిగిన గుజ్జుతో పశువుల దాణా మరియు సొయా చుంక్స్ వంటి తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. సోయాబీన్ ని కొన్ని ప్రాంతాల్లో సొయా చిక్కుడు అనికూడా పిలుస్తారు, దీని పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఉంటుంది. సోయాచిక్కుడును జూన్ 20 నుండి జులై 10 వరకు సాగు చెయ్యవచ్చు. పెసర పంటతో పోలిస్తే సోయాబీన్ వర్షాలను తట్టుకొని మొక్కలపై మొలకెత్తదు.
జూన్ 20 నుండి జులై 10 లోపు పంటను సాగు చేస్తే, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 20 లోపు పంట చేతికి వస్తుంది. సోయాపంటను సకాలంలో సాగు చెయ్యడం ద్వారా రెండో పంటగా వేరుశెనగ మరియు మూడో పంటగా వేసవిలో పెసరను సాగు చెయ్యవచ్చు.
Share your comments