ఏ రైతు అయినా పంట పండించాలంటే మూడు ముఖ్య పెట్టుబడులు అవసరం(భూమి, విత్తనం, నీరు). వీటిలో ముఖ్యమైంది భూమి. రైతు ముందుగా తన భూమి గుణగణాలు తెసుకొని ఏ పంటకు అనుకులంగా ఉంటుందో చూడాలి.కాబట్టి కొత్త పంట సాగు మొదలు పెట్టె ముందే మట్టి పరీక్షలను చేయించుకోవాలి.ఇందుకు అనువైన సమయం (మార్చి,ఏప్రిల్ మరియు మే మాసాలలో) ఇదే
మట్టి పరీక్షలో పంటల పెరుగుదలకు పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. దాని బట్టి ఏ పంట వేస్తె బాగా సాగు అవుతుంది అని ఒక అంచనాకి రావచ్చు.
భూసార పరీక్షతో రైతుకు కలిగే లాభాలు
- నేల స్వభావం మరియు రకాలను తెలుసుకొని (ఆమ్ల,క్షార మరియు తటస్థ), వాటి సవరణ మార్గాలు చేపట్టవచ్చు.
- నేలలోని ప్రధాన ధాతువులు ఏస్థాయిలో ఉన్నవి తెలుసుకొని వివిధ పంటలకు వేయవలసిన మోతాదు నిర్ణయించవచ్చు.
- పరీక్ష చేసిన నేలకు అనుకూలమైన పంటలను సూచించవచ్చు.
- ఫలితాల వల్ల రైతు ఎరువులను కావలసిన మేర మాత్రమే ఉపయోగించి ఖర్చులు తగ్గించుకుని దిగుబడిని పెంచుకోవచ్చు.
- నేల యొక్క సారాన్నిపెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుస్తుంది.
నమూనాలను సేకరించడానికి అనువైన సమయం
రైతులు భూసార పరీక్షల కోసం , పంట పొలంలో లేని సమయంలో మట్టి సేకరించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు పొలం ఆరి ఉండేటప్పుడు మార్చి నుంచి మే నెల తీసుకోవాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎలాంటి ఎరువు చల్లక ముందే, మట్టి నమూనాలు సేకరించాలి.
ఇది కూడా చదవండి
Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!
మట్టి నమూనాలను సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- రైతులు పంటలు సాగు చేసే ముందు ఎరువులు వేసేందుకు మట్టి పరీక్షలు చేసుకోవాలి.
- చెట్ల కింద, గట్ల పక్కన కంచెల దగ్గర మట్టిని సేకరించరాదు.
- కంపోస్టు, పశువుల ఎరువు కుప్పలు ఉంచిన చోట నమూనాలు తీయరాదు.
- మట్టి నమూనాలు తీసేటప్పుడు నేల పైభాగంలోని చెత్తా,చెదారం తీసి వేయాలి.
- నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి మట్టి నమూనాలు సేకరించరాదు. తీసిన మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నీడలో
ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకూడదు.
మట్టి నమూనా సేకరించే విధానం
1.భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక యూనిట్ విస్తీర్ణంలో ఒక చోట నుంచి కాక 10 నుంచి 12 చోట్ల ( ఎంపిక చేసిన పొలంలో జిగ్-జాగ్ పద్ధ్దతిలో )మట్టి తీయాలి.
2.పొలంలో గుర్తులు పెట్టిన చోట చెత్తా, చెదారం తొలిగించాలి. పార ఉపయోగించి 'V' ఆకారంలో 15 సెం.మీ.ల లోతు గుంత తీయాలి తర్వాత పై నుండి కిందకు 2 నుండి 3 సెం.మీ. మందంతో పలుచ పొరలు వచ్చేలా మట్టిని సేకరించాలి.
3.అన్ని చోట్ల తీసిన మట్టిని బాగా కలిపి నాలుగు భాగాలుగా విభజించాలి. మిగిలి ఉన్న మట్టిని మరల కలిపి అదే విధంగా నాలుగు భాగాలు చేసి 2,4 భాగాలు ఉంచుకొని 1,3 భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి అరకిలో వచ్చే వరకు చేసి ప్లాస్టిక్ సంచిలో లేదా గుడ్డ సంచిలో సేకరించాలి.
4.భూమిలో సేకరించిన మట్టి నమూనా నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన పాలిథిన్ సంచి, గుడ్డ సంచిలో నింపి మీ దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి మట్టి నమూనాకు సంబంధించిన మొత్తం వివరాలు (రైతు పేరు, గ్రామము, సర్వే నెంబరు ఇంతకు ముందు పండించిన పంట మరియు ప్రస్తుతం పండించబోయే పంట సంబంధిత వివరాలు) ఒక కాగితం పై వ్రాసి మట్టి నమూనాను సేకరించిన సంచితో జతచేసి దగ్గరలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
మట్టి పరీక్ష లో వెలువడిన ఫలితాల బట్టి ఆ నేల ఈ పంట కి సరిపోతుంది, ఎలాంటి పోషకాలు ఉపయిస్తే భూ సారం పెరుగుతుంది అనే అంశాలపై వ్యవసాయ నిపుణుల సలహాలు పాటించి సాగు పనులు మొదలు పెట్టడం మంచిది.
ఇది కూడా చదవండి
Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!
by-డా.ఎమ్. రాజేశ్వర్ నాయక్ (కార్యక్రమ సమన్వయకర్త), డా.శివకృష్ణ కోట (వ్యవసాయ విస్తరణ శాస్రవేత్త), శ్రీ ఏ. నాగరాజు (కీటక శాస్త్రవేత్త), డా.ఐ.తిరుపతి (పంట ఉత్పాదక శాస్త్రవేత్త), డా. యు. స్రవంతి (ఉద్యాన శాస్త్రవేత్త), డా. బొల్లవేణి సతీష్ కుమార్ (వాతావరణ శాస్త్రవేత్త), శ్రీమతి ఎమ్.జ్యోతి (ల్యాబ్ టెక్నీషియస్), కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా
Share your comments