వ్యవసాయం ఒక జూదం. పెట్టినపెట్టుబడి తిరిగివస్తుందా? రాదా? అన్న సంకోచం రైతులను ఎప్పుడు కలవరపెడుతుంది. కొన్ని సార్లు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, పెట్టుబడికి తగ్గట్టు ఆదాయం ఇచ్చే పంటల సాగు మొదలుపెట్టారు. వాటిలో ఒక్కటే పామ్ ఆయిల్ పంట, ఈ పంట సాగు కోసం రైతులు ఒక్కసారి పెట్టుబడి పెడితే దాదాపు 30 ఏళ్ల వరకు దిగుబడితోపాటు, మంచి ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఎన్నో ప్రోత్సహకాలు అందించడంతో రైతులు ఈ పంట సాగు చెయ్యడనికి మొగ్గు చూపుతున్నారు.
ఆయిల్ పామ్ పంట సాగును విస్తృతం చెయ్యడానికి, ఉద్యానవన శాఖ సైతం రైతులకు ఎన్నో ప్రోత్సహకాలు అందిస్తుంది. ఆశక్తిగల రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి, అర్హత ఉన్న రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణి చెయ్యడంతోపాటు, డ్రిప్ సిస్టం ఏర్పాటుకు రాయితీలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఆయిల్ పామ్ నిర్వహణ, మొక్కల పంపిణితో పాటు, రైతులు పండించిన పంటను కొనుగోలు చెయ్యడం కూడా ఈ సంస్థలే చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ఒక టన్ను ఆయిల్ పామ్ కాయలకు 15-20 వేల రూపాయిల వరకు ఇస్తున్నారు.రైతులు అన్ని యాజమాన్య పద్దతులు పాటిస్తూ మంచి దిగుబడులు పొందినట్లైతే ఒక ఎకరానికి 1.20 లక్ష రూపాయిలు మిగిలే అవకాశం ఉంటుంది.
అయితే ఆయిల్ పామ్ మొక్క ఎదిగి కాయలు రావడానికి సుమారు మూడు సంవత్సరాల సమయం పడుతుంది, ఒక్కసారి దిగుబడి రావడం ప్రారంభమైన తరువాత 30 ఏళ్ల వరకు పంట దిగుబడి పొందేందుకు వీలుంటుంది. మిగిలిన ఉద్యాన పంటలతో పోలిస్తే పెట్టుబడి తక్కువుగా ఉండటం, అధిక లాభాలు రావడం, దీనితోపాటుగా ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయాన్ని మరియు ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నందున, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
ఆయిల్ పామ్ సాగుకు మద్దతుగా ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలతో ముందుకు వస్తుంది, ఎకరానికి 50-60 మొక్కలు అవసరముండగా వాటిని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. పొలంలో డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు బీసీలకు 90% సబ్సిడీ మరియు ఎస్సీ, ఎస్టీ లకు 100% శాతం సబ్సిడీ అందిస్తుంది, పన్నెండున్నర ఎకరాలలోపు సాగుచేసే రైతులు ప్రభుత్వం నుండి రాయితీ పొందవచ్చు. వీటితోపాటుగా పంట ఎదుగుదల కాలంలోనూ ప్రభుత్వం కొంత నగదును ప్రోత్సహకంగా అందిస్తుంది.
Share your comments