ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి పలు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ.. ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయంలోకి దిగి విభిన్న పద్ధతిలో వ్యవసాయం చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు బాల వర్ధన్ రెడ్డి. బీఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదువులు చదివి పలు కంపెనీలలో ల్యాబ్ అసిస్టెంట్ గా ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన బాలవర్ధన్ వ్యవసాయం పై ఉన్న మక్కువతో వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి విభిన్న పద్ధతులద్వారా సాగుచేసే అధిక ఆదాయాన్ని పొందుతున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం అంచెన్ పల్లి గ్రామంలో ఉంది. ఈ జామ తోట సాధారణంగా మనం చూసే జామ తోటలకు భిన్నంగా కనిపిస్తోంది. సాధారణ జామ సాగు కాకుండా హైడెన్సిటీ విధానంలో 8 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి సాగు వల్ల సంవత్సరం మొత్తం పంట దిగుబడి పొందుతూ.. అధిక లాభాలను పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఈ విధమైనటువంటి తైవాన్ జామ సాగు చేయడానికి ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా కేవలం జీవ ఎరువులు, గోమూత్రం, చేపల వ్యర్థ పదార్థాల ద్వారా ఎనిమిది ఎకరాలు హైడెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగు చేస్తూ నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ సాగు కన్నా ముందుగా డైయీరి ప్రారంభించిన బాల వర్ధన్ రెడ్డి అందులో నష్టాలు రావడంతో ఈ విధమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రారంభించాడు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో డ్రిప్ ను ఏర్పాటు చేసుకొని బెంగళూరు నుంచి తన మిత్రుడి సహాయంతో ఈ విధమైనటువంటి మొక్కలను తెచ్చి ఎకరాకి ఏకంగా 1100 మొక్కలను నాటి 15 టన్నుల దిగుబడిని పొందుతున్నాడు.
ఈ విధంగా పంటను సాగు చేయడానికి ఈ యువ రైతు కేవలం జీవామృతం, ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం, మీనామృతం, వేప కాషాయలతో పాటు వేస్ట్ డీకంపోజర్ ను గంజి, ఇంగువ ద్రావణాలతో పాటు వేప కాషాయాలను పిచికారీ చేస్తున్నాడు. ఈ విధంగా ఎనిమిది ఎకరాలలో ఏకంగా 9,500 మొక్కలను నాటి అధిక దిగుబడిని పొందుతున్నాడు.కేవలం హైడెన్సిటీ పద్ధతి ద్వారా మాత్రమే ఈ విధమైనటువంటి సాగుకు అనుకూలమని,అదే పాత పద్ధతిలో అయితే ఈ విధమైనటువంటి సాగు చేయడానికి ఏకంగా 30 ఎకరాల పొలం అవసరం అవుతుందని ఈ సందర్భంగా బాలవర్ధన్ రెడ్డి తెలిపారు ఈ విధంగా సంవత్సరం మొత్తం దిగుబడి పొందుతూ వివిధ దేశాలకు ఈ జామను ఎగుమతి చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Share your comments